Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రావణ్ అరెస్ట్ ఎఫెక్ట్: యూట్యూబ్ వీడియోలు డిలీట్ చేసిన గమన!

Ravan arrest effect Gamana deletes YouTube videos
Advertisement
  • రావణ్ అరెస్ట్ తర్వాత యూట్యూబ్ నుండి వివాదాస్పద వీడియోల తొలగింపు
  • గమనకు ఉచితంగా ఫ్లాట్, ఆర్థిక సాయం అందించిన వైసీపీ నేత ఇంద్రసేన
  • నిందితుల కాల్ డేటాలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు
  • స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్‌కు పంపిన పోలీసులు
  • వైరల్‌గా మారిన గమన భర్త పాత ఆత్మహత్యాయత్నం వీడియో
Advertisement
మావోయిస్టులకు మద్దతుగా వీడియోలు రూపొందించిన కేసులో నిందితుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు కావడంతో అతడి సహచరురాలు గమన అప్రమత్తమైంది. ఈ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆమె తన ఆధ్వర్యంలో నడుస్తున్న యూట్యూబ్ ఛానళ్ల నుండి పలు వివాదాస్పద వీడియోలను తొలగించింది. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ వీడియోల డేటాను తిరిగి రాబట్టేందుకు యూట్యూబ్ సంస్థకు అధికారికంగా ఈమెయిల్ పంపేందుకు సిద్ధమవుతున్నారు.

హార్డ్ డిస్క్‌లు సీజ్.. ఫోరెన్సిక్‌కు ల్యాప్‌టాప్‌లు
హైదరాబాద్‌లోని మాదాపూర్ కేంద్రంగా గమన మూడు యూట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటికి రావణ్ స్క్రిప్టులు, వీడియోలు రూపొందించేవాడు. ఈ కార్యాలయాలపై దాడులు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు పలు ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించారు. ఛానళ్ల అడ్మిన్ హక్కులు గమన వద్దే ఉండటం వల్ల ఆమె డేటాను డిలీట్ చేసినప్పటికీ, ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా ఆ సమాచారాన్ని తిరిగి రికవరీ చేయవచ్చని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విచారణలో తనకు వివాదాస్పద కంటెంట్‌తో సంబంధం లేదని, తాను కేవలం రీల్స్ మాత్రమే చేసుకుంటానని గమన నమ్మించే ప్రయత్నం చేస్తోంది.

వైసీపీ నేతలతో లింకులు..  
వైసీపీ నేత ఇంద్రసేన చౌదరి గమనకు ఉచితంగా ఫ్లాట్ ఇవ్వడమే కాకుండా, భారీగా ఆర్థిక సాయం కూడా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరి బ్యాంక్ ఖాతాల లావాదేవీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుల ఫోన్ డేటాను విశ్లేషించగా, పలువురు వైసీపీ నేతలతో పాటు కొందరు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వీరితో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు వెల్లడైంది. కాగా, ఇంద్రసేన చౌదరిపై గతంలో 2021లో అసలు ఆస్తి పత్రాలు కాజేసి రూ.1.61 కోట్ల మేర బ్యాంకు రుణం తీసుకుని ఆర్థిక మోసానికి పాల్పడినట్లు నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసు హైకోర్టులో వీగిపోయింది.

పాత వీడియోతో కలకలం
ఈ వివాదాల మధ్యే 2023 జూన్‌లో బెంగళూరులో గమన భర్త రామ్ చాకుతో చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. గమన, ఇంద్రసేన చౌదరిల వేధింపులు, వారి ప్రవర్తన వల్లే రామ్ తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ వీడియోను స్వయంగా ఇంద్రసేన చౌదరి చిత్రీకరించినట్టు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Advertisement
Advertisement
Gamana
Ravan Bachalakuri Joseph
Indrasena Chaudhary
Gannavaram Police
Maoist support case
YouTube video deletion

More Telugu News